Thursday, February 26, 2015

సామాన్యుడికి జనరిక్ అభయం


సామాన్యుడికి జనరిక్ అభయం
Posted On:2/26/2015 2:38:05 AM

-రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం
-ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పేదలకు ఏటా రూ.కోట్లలో ఆదా
వైద్యుల సహకారమే కీలకమంటున్న నిపుణులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణ జ్వరం వచ్చినా ఓ మోస్తరు వైద్యుడు కూడా యాంటీ బయోటిక్స్ మందులు రాయడం సహజం. కనీసం వారంపాటు ఆ మందులు వాడాలంటే రూ.వందల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పది రూపాయల విలువైన మందులు రెండు రూపాయలకే వస్తే?! సామాన్య జనానికి ఏటా రూ.కోట్లల్లో డబ్బు ఆదా అవుతుంది. ఇందుకు మార్గం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన దవాఖానలన్నింటిలోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని బోధన, ప్రధాన దవాఖానలతోపాటు ఏరియా దవాఖానాల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే చర్చ మొదలైంది. 

listకనిపించని చిత్తశుద్ధి..generic

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ.35వేల కోట్ల మేర ఫార్మా రంగంలో టర్నోవర్ ఉంది. ఈ క్రమంలో జనరిక్ మందుల భాగస్వామ్యం కనీసంగా 10 శాతం ఉంటుందనేది అంచనా. అంటే ఏటా రూ.3500 కోట్ల వరకు జనరిక్ మందుల ఉత్పత్తి ఉంది. కానీ, ఆ స్థాయిలో వినియోగం లేదు. కనీసం ఉత్పత్తి ఉన్న మేరలోనైనా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వినియోగిస్తే.. సంవత్సరానికి ప్రజల సొమ్ము రూ.వేల కోట్లల్లో ఆదా అవుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. తొలుత నిమ్స్ దవాఖానలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేశారు. కానీ తర్వాత కొద్దికాలానికే ఆ మందుల దుకాణం మూతబడింది. జంట నగరాల్లో 12 జనరిక్ దుకాణాలు నడుస్తున్నాయి.


వైద్యుల సహకారం అనివార్యం


ప్రభుత్వ దవాఖానల్లో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేసినప్పటికీ వైద్యుల సహకారంలేనిది వాటి మనుగడ అసాధ్యమని ఒక రిటైర్డ్ వైద్యాధికారి స్పష్టం చేశారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో అనుభవాలే ఇందుకు నిదర్శనమన్నారు. అమెరికాలో ఒక వైద్యుడు రాసే పది మందుల్లో ఎనిమిది జనరిక్ మందులనే సూచిస్తారని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ) నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న జనరిక్ మందుల దుకాణం ఏర్పాటులో భాగంగా వైద్యుల సహకారం అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వైద్యులను ఒక తాటిపైకి తీసుకువచ్చి.. జనరిక్ మందులను సూచించడం తప్పనిసరిచేస్తే తప్ప ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంచి మేలు తలపెట్టాలి

మంచి మేలు తలపెట్టాలి
Posted On:2/26/2015 1:49:27 AM
సూర్యోదయంతో మొదలైన రోజు చంద్రోదయంతో ముగుస్తూ అనేక అనుభవాలనూ, జ్ఞాపకాలనూ జీవితఖాతాలో చేరుస్తుంది. గొప్పగా బతకాలి, ఏదో చేయాలి అనే తపన ప్రతీ ఒక్కరిలో గంభీరమై నిగూఢమై ఉంటుంది. కానీ జీవన పోరాటంలో సమయం అలా గడిచిపోతూ మంచి ఆలోచనలకు తావివ్వదు. మనిషి తలుచుకుంటే ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు. అనుకోకుండానే మహాత్ములు చేసిన మంచి అనేదే దానికి ఆలంబన.
నిసర్గాదారామే తరుకుల సమారోపసుకృతీ
కృతీ మాలాకారో బకులమపి కుత్రాపి నిదధే
ఇదం కో జానీతే యదహ మిహ కోణాంతరగతో
జగజ్జాలం కర్తా కుసుమభర సౌరభ్యభరితమ్ ॥
అందమైన ఉద్యానవనంలో మొక్కలు నాటే మంచిపనిని చేస్తుండే తోటమాలి అలవాటుగా ఓ మూలన పొగడచెట్టును కూడా నాటుతాడు. అనుకోకుండా ఒక చోటులో పాతిన ఆ చెట్టు తన పుష్పాల పరిమళంలో పరిసర ప్రాంతమంతా పరిమళభరితం చేస్తుందని అతననుకోలేదు. ప్రపంచం చాలా అందమైన అద్భుతం. అందులో భగవంతుడు చేసిన మంచి అపారం. దానిని అందిపుచ్చుకొని సుహృదాలోచనతో జీవించడమే మన బాధ్యత. ఎవరో ఎక్కడో చేసిన మంచికి ఫలాన్ని మనం అనుభవిస్తూ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాన్ని మనస్ఫూర్తిగా మనస్సులోనే సమర్పించుకోగలం. మరి ప్రతిఫలాన్ని అందజేయలేమా! మనసుంటే మార్గముంటుంది. మనం చేసిన మంచి నేడు అనుభవించకపోవచ్చు. భావితరాలు దాని ఫలాన్ని అనుభవిస్తే చేసిన దానికి సార్థకత చేకూరినట్లే.

అనేక కట్టడాలు శ్రమకోర్చి, వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన మహా మహులు నేడు లేరు. కానీ వారి జ్ఞాపకాలుగా చరిత్రకు వన్నె తెచ్చిన నిర్మాణాలు కోకొల్లలు. సంప్రదాయాలను మొదలుపెట్టిన పూర్వీకులు నేటి సమాజానికి మార్గదర్శకులు. వాటిని పాటించడమే కర్తవ్యం. మంచిని పంచిన వారెన్నడూ మేమిది చేశామని చెప్పుకోలేదు. వారు చేసినదే తరతరాలూ అనుభవిస్తూ వచ్చాయి. భగవంతుడు ప్రతీచోటా ప్రత్యక్షంగా మనకు సాయపడలేడు. సర్వాంతర్యామియైన ఆయన ఏదో రూపంలో వచ్చి తన సహకారాన్నందిస్తూనే ఉంటాడు. మంచి అంటే లోకాలను ఉద్ధరించడమని కాదు. ముసలితనంలో చేతికర్ర సహాయంతో నడుస్తున్న వ్యక్తి చేతిలోని కర్రజారితే, దారిన పోయే పసిపిల్లాడు ఏ సంబంధం లేకుండా అందించడం కన్నా మించిన మంచేముంటుంది? లాభనష్టాలకతీతమైన సుహృద్భావన, ఆలోచన, మంచితనం, మనసా వాచా కర్మణా మనిషి చేయగల మహత్కార్యం. మంచిని పంచగల ఔన్నత్యం.

Tuesday, February 24, 2015

పవిత్ర జీవనం

పవిత్ర జీవనం
Posted On:2/24/2015 12:27:18 AM
జీవన దార్శనికత దైనందిన చర్యల్లో ప్రస్ఫుటమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎదుటివారు ఎలా బతకాలో సలహాలివ్వచ్చు. నీటిలోకి దిగితేనే లోతెంతో తెలిసేది. అలాగే ఎవరి బతుకు వారిది. ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ప్రణాళిక వేసుకొని, ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనం బతికేందుకు వేదం ఏనాడో అద్భుత కర్తవ్యోపదేశం ప్రణాళికబద్ధంగా సూచించింది. పవిత్ర జీవనానికి మార్గం చూపింది.

పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా
పునంతు విశ్వాభూతాని పవమానః పునంతు మా ॥
నైతిక విలువలతో మనిషి ఎదిగేందుకు నాలుగు విషయాలను జీవన సూత్రాలుగా మలుచుకొని బతకాలనేది వైదిక ప్రబోధం. భావనాజగత్తులో దివ్యగుణాల పరిపాలకులు దేవతలనీ, అసుర గుణసంపత్తి గలవారు రాక్షసులనీ అనుకుంటే సత్యభాషణం. పరోపకారం, దయ, తృప్తి గలిగిన మహజనులతో సహవాసం చేయగలిగితే జీవితం పావనం అవుతుంది.

మననశీలి మనిషి. వివేకంతో, బుద్ధితో సామాజిక దృక్పథాన్నీ, మంచి చెడులనూ ఆలోచిస్తూ ఆశావహ దృక్పథంతో, మంచి భావనలతో మనసును పదేపదే ప్రేరేపించే శక్తిని మనిషి సాధించాలి. మంచి ఆలోచన తప్పక మంచి కర్మలనే చేయిస్తుంది. పవిత్ర భావనలతో సమాజం వర్ధిల్లుతుంది.
పంచభూతాత్మకమైన ప్రకృతి, పంచేంద్రీయ సహిత మనిషీ లోకంలో సత్సంబంధంతో నిలబడతారు. ప్రకృతిలోనే మావనత్వం పరిమళిస్తుంది. దానికి అతీతమైన జీవనమే లేదు. అనంతమైన ప్రకృతిలో భాగమైన మనిషికి స్వార్థచింతన ఉండదు. పరార్థ భావనలో పరస్పర సహకారానికి ఆస్కారముంటుంది. ఆలోచన విశాలమవుతుంది.
సమాజం బాగుండాలి. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. అనే భావనలు పారమార్థిక తత్తంతో భగవంతుని ప్రార్థించే సత్సంకల్పాలై మానసిక ధైర్యాన్నిస్తాయి. మనలోని భగవత్తత్వానికి ఏరూపమిచ్చినా సృష్టిని నడిపే శక్తి అతీంద్రియమై, అణువణువులోనూ దాగుంది. లోకాస్సమస్తాః సుఖినోభవంతు అనే విశ్వమానవ సౌభ్రాతృత్వం, సామాజిక వికాసం వంటి భావనలే భగవంతునికర్పించే నీరాజనాలు.

గొప్పదారి సహవాసంతో నేర్చిన గుణసంపద, మనిషి మేధస్సులో సంకల్పించే సుహృద్భావన, ప్రపంచమనే ఉదాత్తభావన నేను నుంచి మనం వరకు చేసే ప్రస్థానం, లోకక్షేమం లోనే స్వీయక్షేమం ఉందనే ఆలోచనాపరంగా చేసే భగవత్ప్రార్థన అనే నాలుగు విషయాలు పవిత్ర జీవనాన్ని మానవత్వానికి అంకితం గావిస్తాయి.

Monday, February 23, 2015

ధనానికి మూడే గతులు

ధనానికి మూడే గతులు
Posted On:2/21/2015 1:36:50 AM
ధనవంతుని వద్దనున్న ధనం దానం చేయుటకు ఉపయోగపడును. అట్లే పంచభక్ష్యపరమాన్నాలను సమకూర్చుకొనుటకు, సుగంధపరిమళద్రవ్యాలను, హార చందనాదులను, సుందరమైన వస్త్రములను కొనుటకు, సుఖనివాసమునకు అవసరమైన భవన నిర్మాణమునకు, అలంకరించుకొనదగిన ఆభరణములను పొందుటకు, ఇష్టమైన అవసరమైన ప్రదేశాలలో సంచరించుటకు కావలసిన వాహనములను కొనుటకు ఉపకరిస్తూ ధనికునియొక్క భోగానుభవమునకు కారణమై నిలుచును.
దానధర్మాలకు, అనుభవం కోసం ధనాన్ని ఉపయోగించకపోతే ఆ ధనం నశిస్తుందని, ధనానికి దానము, భోగము, నాశము అనే మూడు గతులే ఉన్నాయి
దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥
అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు.
రాశులకొద్ది ధనం ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని తన అవసరాలకో, తన పరివారం యొక్క అనుభవానికో ఏ మాత్రం ఉపయోగించకపోతే, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించేవారికి, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి సహాయంగా అందించకపోతే, విద్వాంసులను, కళాకారులను సత్కరించుటకు, దేవాలయ నిర్మాణమునకు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుటకు వీలుగా దానంగా ధర్మంగా సమర్పించకపోతే ఆ ధనరాశులు ఇతరుల వశమయ్యే ప్రమాదమున్నది.
పంట పొలాల్లో గడ్డితో తయారుచేసి పెట్టే దిష్టిబొమ్మ పంటకు కాపలాగా ఉంటుంది. పొలం యజమాని శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. అంతేకానీ ఆ పంటను అనుభవించదు. అట్లే ధనాన్ని తాననుభవించక, ఇతరులకు దానం చేయకుండా ఉండే వ్యక్తి కూడా బొమ్మవలె ధనానికి కాపలాదారుగా మాత్రమే ఉంటాడు తప్ప యజమానిగా ఉండడు.
యో న దదాతి, న భుంక్తే విభవే సతి నైవ తస్య తద్ద్రవ్యమ్‌
తృణ కృత కృత్రిమపురుషః రక్షతి సస్యం పరస్యార్థే ॥ అని చెప్పబడినది.
సత్కార్యాలకు దానంగా ఉపయోగించడం, ధనానికి సద్గతి. యజమానికి, అతని పరివారానికి ఉపకరించడం సహజగతి. దుర్జనుల వ్యసనాలను తీర్చుకోవడానికి, దుర్మార్గులు ఆక్రమించుకోవడానికి, విలువ తెలియనివారి చేతికి చిక్కి నిరుపయోగంగా పడివుండడానికి కారణమయ్యే ధనం అధోగతిని పొందినట్లగును.

Thursday, February 19, 2015

సహజత్వం

సహజత్వం
Posted On:2/20/2015 1:17:45 AM
జీవితం అంటే... మహామహులు ఇచ్చే నిర్వచనాలు, ప్రతీరోజూ దుర్భరంగా బ్రతికే సగటు మనుషుల అభిప్రాయాలే కళ్ళముందూ, మనసులో మెదలుతాయే గానీ వాస్తవం ఆలోచించమెందుకు? జీవితం అంటే జీవించడం. తృప్తిగా బతకడం. మనకు నచ్చినట్టుగా బతికే ప్రయత్నంలో పరిస్థితుల ప్రభావం తప్పక ఉంటుంది. కానీ మనదైన సహజత్వం కోల్పోలము. సహజంగా వచ్చిన జీవన రుచులు పొమ్మంటే పోవు.
కస్తం లోహితలోచనాస్య చరణో హంసః కుతోమానసాత్
కిం తత్రాస్తి సువర్ణ పంకజవనాన్యంభః సుధా సన్నిభమ్!
తత్తీరం నవరత్న ఖండఖచితం కల్పద్రుమాలంకృతమ్
శంబూకాః కిముసంతినేతి చ బకైరాకర్ణ్య హీ హీకృతమ్
ఒకసారి కొన్ని కొంగలు... ఎర్రని కళ్ళూ, ముక్కు, కాళ్ళూ ఎవరు నువ్వు? అని అడిగాయి హంస ను. నేనూ హంస అంది. ఎక్కడి నుంచి వచ్చావు? మానససరోవరం నుంచి, అక్కడేముంటుంది? బంగారు పద్మవనాలు అమృతం లాంటి నీళ్ళు, దానిచుట్టూ నవరత్నములు ఖండాలుగా పొదిగి ఉంటాయి. కల్పవృక్షాల చేత అలంకృతమై చాలా అందంగా ఉంటుంది. నత్తగుల్లలుంటాయా? ఉండ వు. ఈ మాట వినగానే కొంగలు హహహ అంటూ నవ్వాయి. హంస కొంగల ఈ సంవాదం మనమూ నవ్వుకునేలా చేస్తాయి. కానీ ఆలోచిస్తే ఎవరిజీవితం వారిది. సహజగుణాలకతీతంగా మార్పులను, అనుకరణనూ అలవర్చుకోవాలంటే అసంభవం. ఒకే జాతికి చెందిన కొంగ-హంసల జీవితాలు ఒకేలా లేవు. ఎవరెవరి బతుకుల్లో వారు ఆనందంగా జీవిస్తున్నారు. మనుషులూ అంతే. ఆదర్శంగా బతకాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. తదనుగుణంగా జీవితాంతం కష్టపడతారు. సామాన్యులు సామాన్యులుగానే, గొప్పవారు గొప్పవారుగానే ఉండిపోరు. ఎందుకంటే జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఎంత ఎదిగినా, ఎలా మారినా తనదైన సహజతను వదులుకోడు మనిషి.
జీవితం అంటే అభిరుచి. అది ఆర్భాటాలకతీతం. సహజంగానే జీవన ఒరవడి కొనసాగుతుంది. అసహజధోరణిలో ఇమడలేక కుంచించుకుపోతుంది. ప్రతీ మనిషి తనేంటో విడమర్చి సమాజానికి చెప్పుకోలేడు. చెప్పగలిగినా అర్థం చేసుకునే సమాజం లేదు. కనుక భగవంతుడు మనిషి జీవితాన్ని విభిన్నకోణాల్లో పరిశీలించి, పరిశోధించి, శ్రమించి, రచించాడు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలో, ఎవరెవరికి ఏమేమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. అనే భావన మానసికంగా కలిగినప్పుడు మనలోని సహజత్వం ఉట్టిపడుతుంది. అందులోని ప్రత్యేక తత్తం అర్థమవుతుంది. ఆనందం జీవనసారం అవుతుంది. తృప్తినిండిన జీవితమే ఆత్మ సమర్పణభావంతో భగవ దర్పితం గావించబడుతుంది.