Sunday, December 7, 2014

Mano Nigraham

మనో నిగ్రహము
Posted On:12/4/2014 1:56:13 AM
మానవులకు ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి. అవికాక పదకొండవ ఇంద్రియం అయిన మనసు అటు జ్ఞానేంద్రియంగా, ఇటు కర్మేంద్రియంగా పనిచేస్తూ ఉభయేంద్రియంగా వ్యవహరింపబడుతుంది. ఈ మనసు లోకంలోని అనేక విషయాలతో మనిషికి బంధాన్ని కలిగిస్తుంది. మళ్ళీ బంధ విముక్తికి కూడా మనసే కారణంగా నిలుస్తుంది.
-మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః
అని భగవద్గీతలో గీతాచార్యుడు పేర్కొన్నాడు. ఈ మన సు చంచల స్వభావం కలది. నిలకడ లేనిది. ఒకచోట నిలుపుటకు శక్యము కానిది. బలిష్ఠమైనది. మనుషులను వ్యాకుల పరచునట్టిది. పరిపరి విధాలుగా దృఢంగా సంచరించునట్టిది. ఎదురుగాలిని విసనకర్రతో అడ్డుకొనుట ఎట్లా అసంభవమో, ఈమనస్సును అడ్డుకొనుట కూడా దుష్కరము -
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢమ్
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ॥

అని భావించుచున్నానని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో మనస్సు చలించు స్వభావం కలిగినదే. నిగ్రహింప శక్యము కానిదే. ఇందు ఎట్టి సంశయం లేదు.కాని ఈ మనస్సును అభ్యాసం చేతను, వైరాగ్యము చేతను వశముచేసుకొన వచ్చును
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్
అభాస్యేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥
అని భగవద్గీతలో ఆత్మసంయమ యోగమనే ఆరవ అధ్యాయంలో పేర్కొనెను.

సీతాన్వేషణకై బయలుదేరిన హనుమంతుడు లంకిణిని వధించి లంకలో ప్రవేశించి, అంతటా వెతుకుతూ వెతుకుతూ రావణాసురుని శయ్యాగృహంలోకి చేరుకొనెను. స్త్రీని వెతకాలంటే స్త్రీలు నివసించే ప్రదేశంలోనే వెతకాల్సి ఉన్నందున నేను రావణుని అంతఃపురంలోని శయ్యాగృహంలోకి ప్రవేశించాను. ఇక్కడ రావణ పత్నులను చూసినా నా మనసు వశం తప్పలేదు.మంచి పనిలోగాని, చెడ్డపనిలోగాని ఇంద్రియములను ప్రవర్తింపచేయునది మనసే.
-మనో హి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే
అని చెప్పబడినది. నా మనసు నా వశంలోనే ఉన్నది. ఇక నాకు ఏ దోషము అంటదు అని భావించెను. ఇట్టి మహనీయుల ఆచరణను మహాత్ముల ఉపదేశాలను ఆదర్శంగా గ్రహిద్దాం. మనోనిగ్రహానికై ప్రయత్నిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular